వేసవి కాలం వచ్చిందంటే చాలు.. తిరుమల గిరులు భక్తులతో నిండిపోతాయి. పిల్లలకు వేసవి సెలవులు లభిస్తాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కానీ ఈ వేసవి కాలం తిరుమలలో పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొండపై వీకెండ్స్‌లో కూడా పెద్దగా రద్దీ కనిపించడం లేదు ఏదో పర్వాలేదనిపిస్తోంది. శ్రీవారి దర్శనం చాలా త్వరగా అయిపోతోంది. వేసవి కాలంలో రోజుకు సగటున 70 నుంచి 80 వేల మంది దర్శించుకుంటారు. ఈ సంఖ్య వారాంతాల్లో మరింత పెరుగుతుంది. దాదాపు భక్తుల సంఖ్య లక్షకు పెరిగింది.
ఇప్పుడు వేసవి మొదలైనా కూడా భక్తుల రద్దీ అంతంత మాత్రమే. దీనికి కారణం లేకపోలేదు. ఏపీలో ఎన్నికలు ఒక కారణమైతే ఆ ఎన్నికల కోడ్ కారణంగా సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం ఒక కారణం. దీంతో చాలా మంది తిరుమల పర్యటనను వాయిదా వేసుకుంటున్నారు. కేవలం ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు పొందిన భక్తులతో పాటు సర్వదర్శన భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకునేందుకు వెళుతున్నారు. దీంతో భక్తుల రద్దీ బాగా తగ్గింది. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23 వ తేదీ వరకూ 16,51,341 మంది భక్తులు దర్శించుకుకోగా ఈ ఏడాది 15 లక్షల మంది భక్తులే దర్శించుకున్నారు.