చిన్న శేషవాహనంపై భక్తులను కటాక్షించిన కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారు

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు మే 28వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరిగింది. ఈ ఉత్సవాలు జూన్ 6వ తేదీ వరకూ వైభవంగా జరుగనున్నాయి. ఈ 9 రోజుల పాటు స్వామివారు ఉదయం, సాయంత్రం వేళల్లో వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. స్వామివారు నేటి ఉదయం చిన్న శేష వాహనంపై దర్శనమిచ్చారు. ఇవాళ సాయంత్రం స్వామివారు హంస వాహనంపై దర్శనమివ్వనున్నారు.

కాగా నిన్న ఉదయం స్వామివారి ధ్వజారోహణం వైభవంగా జరిగింది. సాయంత్రం పెద్ద శేష వాహనంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ వాహన సేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో జూన్ 1వ తేదీ సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకూ స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. దంపతులు రూ.750 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. కల్యాణోత్సవంలో పాల్గొనే వారికి ఉత్తరీయం, రవికె, స్వామివారి ప్రసాదం వంటివి బహుమానంగా అందజేస్తారు. ఇక జూన్ 7వ తేదీన మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం నిర్వహిస్తారు.

Share this post with your friends