హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా జూన్ 2వ తేదీన తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 18 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2,872 శ్లోకాలను పండితులు పారాయణం చేస్తారు. హనుమంతుడు విశ్రాంతి లేకుండా రామకార్యం కోసం వెళ్లిన విధంగా పండితులు నిరంతరాయంగా సంపూర్ణ సుందరకాండను పారాయణం చేస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
రామాయణంలో ఐదవ కాండ సుందరకాండ. హనుమంతుడు లంకను చేరుకోవడానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11999 శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం 12000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను ‘పారాయణ కాండ’ అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సముద్రాన్ని దాటడం, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను మునికి తెలియజేయడం ఇందులో ముఖ్యాంశాలుగా ఉన్నాయి.