దేవాలయంలో చేయకూడని పనులేంటో తెలుసుకున్నాం. అలాగే దేవుడిని దర్శించుకునే క్రమంలో ఏం చేయాలో కూడా తెలుసుకున్నాం కదా. ప్రస్తుత తరుణంలో గుడికి వచ్చినవారు దర్శనానంతరం గుడి మెట్లపై కూర్చొని ప్రపంచ విషయాలన్నింటినీ చర్చిస్తూ ఉంటారు. గుడి మెట్లపై కూర్చొని వ్యాపారాలు, రాజకీయాలు, ఊరి విషయాలు, పక్కింటి వారు ఎదురింటి వారి గురించి మాట్లాడుకుంటూ వృథా కాలక్షేపం చేస్తున్నారు. ఇలా చేయడం సరికాదు. చక్కగా ఆలయ ఆవరణలో కూర్చొని భగవంతుడి రూపాన్ని మనసులో స్మరించుకోవాలి.
కొందరు దేవాలయానికి వెళ్లగానే గంట కనిపిస్తే అదే పనిగా కొడుతూనే ఉంటారు. అయితే అలా చేయకూడదట. ఎందుకంటే దైవం ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడని చెబుతారు. కాబట్టి ఆయన ధ్యానానికి మనం భంగం కలిగించకూడదట. గంట శబ్దం విపరీతంగా వస్తుంది. దీంతో స్వామివారి ధ్యానానికి భంగం కలుగుతుందట. దేవాలయంలో ప్రసాదం తీసుకున్న తర్వాత భక్తితో కళ్లకు అద్దుకున్న మీదట నోట్లో వేసుకోవాలి. ప్రసాదం ఎక్కువెక్కువ తీసుకుని వృథా చేయకూడదు. అలాగే నలుగురు తొక్కే ప్రదేశంలో ప్రసాదాన్ని పడేయకూడదు. ప్రసాదం అంటే దేవుని అనుగ్రహం అని గ్రహించాలి.