ఇంట్లో దేవుడి విగ్రహాన్ని పెట్టవచ్చా? నిబంధనలు ఏంటి?

హిందూమతం విగ్రహారాధనకు పెద్ద పీట వేస్తుంది. ఆలయాల్లో ఓకే కానీ ఇంట్లో దేవుడి విగ్రహాలు పెట్టవచ్చా? ఒకవేళ పెడితే ఎలాంటి విగ్రహాలు పెట్టాలి? వంటి విషయాలను తెలుసుకుందాం. ఇంట్లోని పూజ గదిలో పెట్టుకునే దేవుడి విగ్రహాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆధ్యాత్మికతను ప్రాధాన్యంగా తీసుకుని దేవుడి విగ్రహాలను ఎంచుకోవాలి. ఈ క్రమంలోనే వాస్తు అంశాలు సైతం కీలకమే. నివాస స్థలంలో సరిపోయేలా దేవుడి విగ్రహ సైజును ఎంచుకోవాలి. దేవుడి విగ్రహం ఇంట్లో ఉంటి ప్రతి రోజూ పూజ చేయాల్సిందే. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణ నిర్వహణ తప్పనిసరిగా ఉండాలి.

దేవుని విగ్రహాన్ని సరైన స్థానంలో ఉంచాలి. పెద్ద పెద్ద విగ్రహాలను ఇంట్లో పెట్టినవారు ప్రతిరోజూ మహా నివేదన, వారానికి ఒకసారి ప్రత్యేక అభిషేకం తప్పక నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్లోకి తక్కువ ఎత్తు ఉండే విగ్రహాలను ఎంచుకోవడం ఉత్తమం. పూజా మందిరంలో విగ్రహాన్ని ముందుగా మీ ఇంటి దైవానికి పసుపు రాసి అనంతరం గదిలోని గోడకు పసుపు రాసి పెట్టాలి. కొందరు తులసి ఆకులు లేదా తమలాపాకులను గోడకు రాస్తారు. అలా చేసినా కూడా ఆ తరువాత గోడకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. పూజా మందిరం ప్రత్యేకంగా లేకుంటే మాత్రం పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, ఉగ్ర నరసింహ స్వామి ఫోటోని పెట్టకూడదు. నవగ్రహాలను ఇంట్లో పెట్టకూడదు. అలాగే చేతిలో పిల్లనగ్రోవి ఉండే కన్నయ్య విగ్రహాన్ని సైతం ఇంట్లో ఉంచకూడదు. అయితే గోమాతతో ఉండే వేణుగోపాలుడి విగ్రహం లేదా ఫొటోలు మాత్రం పెట్టవచ్చు.

Share this post with your friends