ఏపీలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఆలయం ద్వారకా తిరుమల చిన్న వేంకన్న ఆలయం. తిరుమలలో మొక్కుకున్న మొక్కులు ఇక్కడ తీర్చుకున్నా కూడా స్వామివారికే చెందుతాయని చెబుతారు. తిరుమలకు వెళ్లలేని వారంతా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడి ఆలయ విశేషం ఏంటంటే.. ఏడాదికి రెండు పర్యాయాలు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. దీనికి ఓ కారణం ఉంది. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయ గర్బాలయంలో స్వామివారు ఇద్దరు ధ్రువమూర్తులుగా దర్శనమిస్తారు. దీనికి ఓ కథ ఉంది.
ద్వారకా మహర్షి స్వామి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఘోర తపస్సు చేశారట. ఆయన చాలా కాలం పాటు తపస్సులోనే ఉండిపోవడంతో ఆయన చుట్టూ పుట్ట వచ్చేసిందట. అయినా సరే.. ద్వారకా మహర్షి తపస్సును వీడలేదట. దీంతో ప్రసన్నుడైన స్వామి మహర్షి తపస్సును ఆచరించిన చోటే స్వయంభువుగా వెలిశాడట. అయితే స్వామివారి మూర్తి నడుము నుంచి సగభాగం వల్మీకం (పుట్ట)లో కప్పబడిపోయింది. విష్ణు మూర్తికి పాదపూజే అతి ముఖ్యమట. మరి స్వామివారి పాదాలు పుట్టలో ఉండిపోయాయి. దీంతో అర్చకులు, వేదపండితులంతా సమాలోచన చేసి తిరుపతి నుంచి మరో మూర్తిని తీసుకొచ్చారట. దీంతో ఇక్కడ స్వామి వారు ఇద్దరు దృవమూర్తులుగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఇద్దరు ధృవమూర్తులకు ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.