వీసా గాడ్‌గా పేరు తెచ్చుకున్న ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గురువారం నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా నేడు గరుత్మంతునికి నైవేద్యం సమర్పించారు. ఈ ప్రసాదాన్ని పిల్లలు లేని మహిళలు తీసుకుంటే తప్పక సంతానం కలుగుతుందట. దీంతో సంతానం లేని వారంతా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. ప్రతి ఏటా శ్రీరామనవమి వెళ్లిన తెల్లవారే అంటే దశమి రోజు నుంచి చిలుకూరు బాలాజీ ఆలయంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది.
ఇక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున అంటే గురువారం పూజకు పుట్టమన్నుతో అర్చకులు అంకురార్పణ చేశారు. ఇక నేటి ఉదయం నుంచే స్వామివారికి వివిధ రకాల సేవలు ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం శేషవాహన, ధ్వజారోహనం సేవలను అర్చకులు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 వరకూ కొనసాగనున్నాయి. 20న స్వామివారికి హనుమాన్ వాహన సేవ, గోపవాహన సేవ, 21న సూర్యప్రభ వాహనం, గరుడ వాహనం, రాత్రికి స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించునన్నారు. 22న వసంతోత్సవం, గజవాహన సేవలు.. 23న పల్లకి సేవ, అర్థరాత్రి 12 గంటలకు స్వామివారి రథోత్సవం, 24న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వవాహన సేవ, దోప్ సేవ, పుష్పాంజలి సేవ.. ఇక 25న ధ్వజారోహనంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.