శ్రీకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ స్వామి వారు 9 వ రోజు బుధవారం కృష్ణావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న శ్రీరాముడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముందుగా ఆలయ మాఢ వీధుల్లో కృష్ణావతారంలో ఉన్న శ్రీరాముడిని ఆలయ మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామి వారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, భక్తుల కోలాటాల నడుమ రాజ వీధిలో తిరువీధి సేవ నిర్వహించారు. భక్తులంతా స్వామి వారికి మంగళ హారతులతో అడుగడుగునా నీరాజనాలు పలికారు. మరోవైపు రేపు వైకుంఠ ఏకాదశి కావడంతో ఆలయ అధికారులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Share this post with your friends