భక్తులకు బ్యాడ్ న్యూస్.. భద్రాద్రి రామయ్య కల్యాణం లైవ్ టెలికాస్ట్ ఈ ఏడాది లేనట్టే..?

భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని అక్కడకు వెళ్లి వీక్షించలేని భక్తులంతా ప్రతి ఏటా టీవీలలో లైవ్ టెలికాస్ట్ చూసి తరిస్తుంటారు. వృద్ధులతో పాటు వివిధ కారణాలతో స్వామి వారి కల్యాణానికి వెళ్లలేని వారంతా శ్రీరామనవమి రోజున ఉదయం టీవీలకు అతుక్కుపోతారు. కానీ ఈసారి వారందరికీ బ్యాడ్ న్యూస్. రాముల వారి కల్యాణానికి సైతం ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. లైవ్ టెలికాస్ట్‌‌లపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది. దీంతో స్వామివారి కల్యాణం లైవ్ టెలికాస్ట్ ఉంటుందా? లేదా? అనేది సందేహంగా మారింది. రాములవారి కల్యాణం ఒక్కదానికి లైవ్ టెలికాస్ట్‌కు అనుమతి ఇవ్వాలని ఈసీకి దేవాదాయ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు.

అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని కాబట్టి లైవ్ టెలికాస్ట్‌కు అనుమతి ఇవ్వలేమని ఈసీ తెలిపింది. 40 ఏళ్లుగా స్వామి వారి కల్యాణం లైవ్ టెలికాస్ట్ అవుతోంది. అలాంటిది ఈ ఏడాది లేదంటే భక్తులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజానీకం ఎదురు చూస్తుంటారని.. లైవ్ టెలికాస్ట్‌కు అనుమతి ఇవ్వాలని మరోసారి ఈసీకి దేవాదాయ శాఖ లేఖ రాసింది. మరి ఈ లేఖపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. పాజిటివ్‌గా స్పందిస్తే.. లైవ్ టెలికాస్ట్‌ ఉంటుంది. లేదంటే ఈ ఏడాది స్వామివారి కల్యాణం లైవ్ టెలికాస్ట్ లేనట్టే.

Share this post with your friends