అరటి గురించి ముఖ్యంగా హిందువులకు బాగా తెలుసు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకూ ఏ శుభకార్యం జరిగినా అరటి ఆకునా కానీ.. పండ్లను వాడుతూనే ఉంటాం. ఈ అరటి ప్రాముఖ్యత గురించి రామాయణంలోనూ .. భాగవతంలోనూ వివరించబడింది. అరటిని ‘కదళి’, ‘రంభ’ అని పిలుస్తారు. దేవుళ్ల ప్రతి ఒక్క పూజా కాక్యక్రమంలోనూ.. వ్రతాలు, నోముల సమయంలోనూ అరటి ఆకులు, పళ్లను ఉపయోగిస్తారు. అలాగే హిందువులు భోజన సమయంలోనూ అరటి ఆకులను వాడుతారు. ఇంట్లో గుమ్మాలకు, వ్రత పీటలకు అరటి కొమ్మలను కడుతూ ఉంటారు. పెళ్లిలో కూడా అరటికి ప్రాధాన్యత ఉంటుంది.
అలాంటి అరటి అసలెలా ఆవిర్భవించిందనడానికి పలు కథనాలున్నాయి. సృష్టి ఆవిర్భవించిన మొదట్లో విరాట్ స్వరూపునితోపాటు లక్ష్మీ, దుర్గ, వాణి, సావిత్రి అనే పంచ శక్తులు కూడా పుట్టాయి. వీరు మహా సౌందర్యరాశులు. వీరితో పాటు సమాన సౌందర్యాన్ని రాధ, సావిత్రిలు కలిగి ఉండేవారట. దీంతో సావిత్రి తన సౌందర్యాన్ని చూసుకుని గర్వించేదట. దీంతో ఆమెను బీజం లేని చెట్టుగా భూలోకంలో జన్మించాలని విరాట్ మూర్తి శపించాడట. తప్పును తెలుసుకున్న సావిత్రి ఎంత వేడుకున్నా ప్రయోజనం లేకపోవడంతో భూలోకంలో కదళి అనే అరటి చెట్టుగా జన్మించిందట. తన శాప విముక్తి కోసం కదళి ఘోర తపస్సు చేయగా.. విరాట్ మూర్తి ప్రత్యక్షమై పుణ్యలోక ప్రాప్తిని సావిత్రికి అనుగ్రహించాడట. అయితే అంశరూపమైన కదళిని మాత్రం భూమిపైనే ఉంటూ మానవ, మాధవ సేవ చేయాలని ఆదేశించాడట. ఇది అరటి కథ.