బాబా బర్ఫానీ గతంలో దర్శనాల ప్రారంభానికి ముందే అదృశ్యం.. ఎప్పుడంటే..

మంచు శివలింగమైన బాబా బర్ఫానీ అదృశ్యం వార్తలు భక్తులను కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎంతో కష్టపడి అమర్‌నాథ్ గుహ వరకూ వెళితే అక్కడ శివలింగం కనిపించకుంటే మనసు నొచ్చుకుంటుంది. ఇప్పుడదే జరుగుతోంది. బాబా బర్ఫానీ కరిగిపోవడానికి కారణం గ్లోబల్ వార్మింగ్‌తో పాటు అమర్‌నాథ్ గుహ చుట్టూ పెరిగిన మానవ, యాంత్రిక కార్యకలాపాలని కూడా అంటున్నారు. అయితే బాబా బర్ఫానీ ఇలా కరిగిపోవడం తొలిసారేమీ కాదని.. గతంలో అయితే కనీసం దర్శనాలు కూడా ప్రారంభం కాకముందే బాబా బర్ఫానీ కరిగిపోయారట. 2006లో ఇది జరిగింది. అప్పుడు కనీసం యాత్ర కూడా ప్రారంభం కాకముందే మంచు శివలింగం కరిగిపోయింది.

ఇక 2004లో సైతం బాబా బర్ఫానీ కరిగిపోయారు కానీ వెంటనే కాదు. యాత్ర ప్రారంభించిన 15 రోజులకే హిమ లింగం అంతరించిపోయింది. 2013లో హిమలింగం 22 రోజుల్లో కరిగిపోగా 2016లో 13 రోజుల్లో కరిగిపోయింది. అయితే దీనికి భక్తులు కూడా కొంత కారణమని ఒక అధ్యయనం చెబుతోంది. గుహలో భక్తులు దాదాపు 250 మంది ఒకేసారి ఉంటారు. దీంతో అక్కడ మనుషుల నుంచి వచ్చే వేడి నేరుగా బాబా బర్ఫానీని ప్రభావితం చేస్తోంది. బాబా బర్ఫానీ కరగకుండా ఉండాలంటే.. దర్శనానికి గుహలోకి ఒక్కసారిగా వెళ్లే భక్తులను పరిమితం చేయాలని నిపుణులు చెబుతున్నారు. గుహ చుట్టూ యంత్రాల వినియోగంపై నిషేధం విధించాలని సైతం తెలియజేస్తున్నారు.

Share this post with your friends