తిరుమల శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదంతో పాటు ఇకపై అదనంగా మరొక ఐటెంను కూడా మెనూలో చేర్చడం జరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు ఇకపై అన్నప్రసాదంతో పాటు మసాలా వడ వడ్డించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అన్న ప్రసాదంలో భాగంగా అన్నం, ఒక కూర, సాంబార్, రసం, కొబ్బరి చట్నీ, మజ్జిగా, చక్కెర పొంగలి వడ్డిస్తున్నారు. ఇకపై వీటన్నింటితో పాటు మసాలా వడ కూడా వడ్డించనున్నారు. దీనిని ప్రయోగాత్మకంగా ఐదు వేల మందికి ఇప్పటికే తయారు చేసి వడ్డించారు.
రథసప్తమి రోజు నుంచి శ్రీవారి భక్తులకు పూర్తి స్థాయిలో ఇక మీదట మసాలా వడను సైతం వడ్డించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు రథసప్తమి నాటి నుంచి అన్నప్రసాదం భవనంలో త్వరలోనే భక్తులందరికి కూడా వడలు(గారెలు) సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వడలో తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఉల్లిపాయ వంటివి ఏమీ వినియోగించరు. సాధారణంగా వడల్లో అవన్నీ వాడతారు కానీ స్వామివారికి అవేమీ వినియోగించరు కాబట్టి భక్తులకు వడ్డించే వడల్లో సైతం ఇలాంటివేమీ ఉండవు.