మనకు ఏదైనా ఆపద వచ్చినా.. ధైర్యం కూడగట్టుకోవాలన్నా.. మనో బలం పెంపొందించుకోవాలన్నా మనం ముందుగా తలచుకునేది ఆంజనేయ స్వామినే. సాక్షాత్తు పరమేశ్వుడే ఆంజనేయుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. శివుడి అంశతో జన్మించిన ఆంజనేయుడు ఇప్పటికీ హిమాలయాల్లో సజీవంగా ఉన్నాడట. చిరంజీవి అయిన హనుమంతుడిని నిత్యం సేవిస్తే శని దోషాలతో పాటు ఎలాంటి కష్టాలూ ఉండవట. ఆంజనేయస్వామిని రాముడికి నమ్మిన బంటుగా త్రేతాయుగంలో వాల్మీకి రామాయణం చెప్పింది.
రామాయణంలో రాముడికి ఎంతైతే విశిష్టత ఉంటుందో ఆయన భక్తుడిగా హనుమంతుడికి అంతే విశిష్టత ఉంటుంది. సీతమ్మను రావణాసురుడు అపహరించిన తర్వాత రామునికి లోకమంతా చీకటి అయిపోయింది. ఈ నేపథ్యంలోనే సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరాముడి వియోగాన్ని తొలగించి ఆయనలోని నిరాశ నిస్పృహలను తొలగించాడు. అందుకే మనం కూడా ఎంతటి నిరాశ నిస్పృహలు కలిగినా హనుమ దర్శనంతో అవన్నీ పటాపంచలై పోతాయని నమ్మకం. హనుమంతుని దర్శించుకుంటే చాలు.. దుష్ట శక్తులు, పిశాచాల వంటివి సైతం దరి చేరవని నమ్మకం.