తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవంలో భాగంగా పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలను పెట్టి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి మంగళవాయిద్యాల నడుమ ఉరేగింపుగా వచ్చి నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. ఆపై మిగిలిని రెండింటినీ ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు.
ఆ తరువాత తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామివారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామివారికి, టీటీడీ తరఫున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని అర్చకులు వరుస క్రమంలో కుడిచేతికి తాకిస్తారు. ఆపై హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేస్తారు. అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు. ఇక ఆణివార ఆస్థానం సందర్భంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు.