వారణాసిలో జరిగిన దీపావళి వేడుకల్లో అపురూప ఘట్టం చోటు చేసుకుంది. లాంహి ప్రాంతంలో శ్రీరాముని ఆలయంలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు జరిగాయి. అక్కడి శ్రీరాముడికి మహా హారతి నిర్వహించారు. ఈ మహా హారతిని నిర్వహించింది ఎవరనేదే ఆసక్తికరం. ముస్లిం మహిళలు మహా హారతిని స్వామివారికి ఇచ్చారు. 2006లో వారణాసిలోని సంకట్ మోచన్ టెంపుల్‌లో బాంబు ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత స్వామివారికి మహాహారతినిచ్చే సంప్రదాయం ప్రారంభమైందట. రామనవమి, దీపావళి ఈ రెండు రోజుల్లో ముస్లిం మహిళలు ఆచారాల ప్రకారం శ్రీరాముని ఆరతిని నిర్వహిస్తారు.
దేశంలోని ప్రజలకు శాంతి, సౌభ్రాతృత్వంతో పాటు శాంతి సందేశాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యంగా ఆలయ వేద పండితులు తెలిపారు. ఈ క్రమంలో కాశీలో ముస్లిం మహిళలు శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లికి సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. రాముడికి ప్రపంచానికి ఆదర్శప్రాయుడని, జీవితంలో అన్ని విధాలుగా ముందుకు సాగేందుకు మార్గం చూపిన ఆయన బాటలోనే మనమంతా నడవాల్సిన అవసరం ఉందని అక్కడి ప్రజలు ప్రపంచానికి చాటి చెప్పారు. అంతేకాకుండా అక్కడికి హాజరైన ప్రజలంతా ఒకరికొకరు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.