అష్టమంగళ చిహ్నాల్లో శంఖం, శ్రీ చక్రం ప్రాధాన్యత ఏంటంటే..

అష్టమంగళ చిహ్నాల్లో ఇప్పటికే కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చివరిగా శంఖం, శ్రీ చక్రం, గరుత్మంతుడి గురించి చూద్దాం.

శంఖం: శంఖం తెల్లగా,స్వఛ్ఛమైనది. పవిత్ర మైన ఓంకార నాదాన్ని కలిగిస్తుంది. శ్రీ మన్నారాయణుడు ఎప్పుడూ శంఖు చక్రాలను ధరించి వుంటాడు. శంఖాలు రెండు రకాలు. దక్షిణావర్త శంఖం యిది మంగళకరమైనది. పాలకడలి లో శ్రీ మహాలక్ష్మితో పాటు పుట్టినదే. ఈ వలంపురి శంఖం శ్రీ మహావిష్ణువు ఎడమ చేతిలో వుంటుంది. వలంపురీ శంఖం నుంచి ఓంకారనాదం సహజంగానే ధ్వనిస్తుంది.

శ్రీ చక్రం: వలయాకారంలో సులభంగా చుట్టేది చక్రం. కాలాన్ని కాల చక్రం అంటారు. సూర్య భగవానుడు కాలాన్ని నడిపిస్తాడని అంటారు. చక్రత్తాళ్వారు శ్రీ చక్రం యొక్క అంశ. శ్రీ మన్నారాయణుని ప్రధాన ఆయుధంగా చెప్పబడుతుంది. శ్రీ మన్నారాయణుడు ఎప్పుడూ చక్రమును చేతిలో ధరించి వుంటాడు.

గరుత్మంతుడు: కశ్యపముని వినతల పుత్రుడే గరుత్మంతుడు. ఆయనను “గరుడాళ్వార్”అని “పెరియ తిరువడి” అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. బ్రహ్మోత్సవాల సమయంలో గరుడోత్సవం ఘనంగా జరుపుతారు. గరుత్మంతుడు మహాబలశాలి ,ధైర్యశాలి. దానవులతో యుధ్ధం చేసి,అమృత కలశమును భద్రముగా తీసుకుని వచ్చినవాడు. నిరంతరం వైకుంఠం లో శ్రీ మహావిష్ణువు సన్నిధి భాగ్యము పొందిన వాడు గరుత్మంతుడు. ఈ పక్షీంద్రుడు వేదస్వరూపుడు,కాంతిమంతుడు. నాగులను ఆభరణములుగా ధరించిన వాడు. వైకుంఠం లో భగవంతుని కి అద్దంగా నిలబడినట్లు చెప్తారు. శ్రీ మహావిష్ణువు ఆలయమునుండి ఊరేగింపు కి బయలుదేరుటకు ముందు అద్దాల సేవ జరుగుతుంది. సర్వాంతర్యామియైన భగవంతుడు భక్తుల పూజలను స్వీకరించి సర్వదా సంరక్షిస్తూ ఉంటాడు.

Share this post with your friends