అమర్‌నాథ్ యాత్ర కోసం ఎదురు చూస్తున్న భక్తులకు గుడ్ న్యూస్. ఈ నెల 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. అమరనాథ్ యాత్ర ఆగస్ట్ 19 వరకూ కొనసాగనుంది. మొత్తంగా ఈ యాత్ర 52 రోజుల పాటు కొనసాగనుంది. అమర్‌నాథ్ యాత్రకు వచ్చే భక్తుల కోసం ఇప్పటికే అధికార యంత్రాగం ఏర్పాట్లు నిర్వహిస్తోంది. అమరనాథ్ యాత్ర కోసం ఇప్పటికే అధికారులు రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకూ 3 లక్షల మందికి పైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బోర్డు తెలిపింది. చార్‌దామ్ యాత్రను బట్టి చూస్తే ఈసారి అమరనాథ్ యాత్ర కోసం 10 లక్షల మందికి పైగానే రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక అమర్‌నాథ్ యాత్రికుల కోసం మూడు ప్రదేశాల్లో బహల్తాల్, పహల్తాల్, జమ్మూ ప్రాంతాల్లో బస ఏర్పాటు చేశారు.
ఈ మూడు చోట్ల ప్రతిరోజూ 50వేల మంది బస చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్పటికే తొలిరోజు ఎంతమందిని యాత్రకు పంపాలనే విషయమై కూడా సమాలోచనలు జరిగాయి. తొలిరోజు జమ్మూ నుంచి 20 వేల మందిని యాత్రకు పంపనున్నారు. వీరిని కూడా రెండు భాగాలుగా విభజించి రెండు మార్గాల్లో పంపనున్నారు. అంటే 10 వేల మందిని బల్తాల్ మార్గంలో.. మిగిలిన వారిని పహల్గామ్ మార్గంలో పంపుతారు. మార్గమధ్యంలో125 లంగర్లను ఏర్పాటు చేశారు. ఇవి జూన్ 17 నుంచి ప్రారంభం కానుంది. లంగర్ల వద్ద సుమారు 1.5 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అమరనాథ్ యాత్రకు వచ్చే భక్తులకు వైద్య సదుపాయం కూడా కల్పిస్తున్నారు. చాలా చోట్ల ఆసుపత్రులను సైతం నిర్మించారు.