
చాతుర్మాస్య వ్రతమును ప్రతి ఒక్కరూ తప్పకుండ ఆచరించి తీరవలెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, విధవాస్త్రీ, రజస్వలా, ముత్తైదువ, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి మొదలగువారు ఈ వ్రతమును వదలకుండ చేసి తీరవలెనని శాస్త్రాలు చెబుతున్నవి. ఇటీవలి కాలంలో యతులు మాత్రమే ఆచరిస్తున్న కారణంగా- చాతుర్మాస్య వ్రతాన్ని సన్యాసులు లేదా పీఠాధిపతుల కార్యక్రమంగా భావిస్తున్నాం. వాస్తవానికి అన్ని వర్గాల వారు సర్వ ఆశ్రమాల వారు చాతుర్మాస్య వ్రతం పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
నిత్యం కార్యం చ సర్వేషాం
ఏతద్ వ్రత చతుష్టయం |
నారీభిశ్చనరైర్వాపి
చతురాశ్రమ వర్తిభిః ||
బ్రాహ్మణః క్షత్రియః వైశ్యః
స్త్రియః శూద్రో ప్రతీయథా ||
గృహీ వనస్థః కుటచోబహూదః
పరమహంసకః ॥
నరకాన్న నిర్వర్తంతే
త్యక్త్వా వ్రత చతుష్టయం ॥
చాతుర్మాస వ్రతం ఆచరించడమనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. యుగ యుగాలుగా ఆచరణలో ఉందని విష్ణు ధర్మోత్తర, భవిష్య, స్కాంద పురాణాలలోని కథనాల వలన అవగతమవుతుంది. ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలలుపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట. అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా అవి మారాయి. తొలినాళ్ళలో వర్ష, హేమంత, వసంత – అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష ఋతువుతోనే సంవత్సరము ఆరంభామవుతూ ఉండేది. ఈ కారణం వల్ల సంవత్సరానికి ‘వర్షం’ అనే పేరు వచ్చింది. సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలములో ఒక్క ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు.
