దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయంలో సీతారాముల కల్యాణం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రామయ్య కల్యాణం కోసం భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. సీతారాముల కల్యాణం వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు భద్రాద్రికి చేరుకుంటున్నారు. మొదట కల్యాణం రామాలయంలో మూలవరులకు జరుగనుంది. ఆ తరువాత ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకుని రానున్నారు. స్వామివారి కల్యాణం అభిజిత్ లగ్నంలో జరగనుంది.
కల్యాణ క్రతువు వచ్చేసి ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకూ.. స్వామివారి కల్యాణం కోసం మిథిలా స్టేడియంలో 24 సెక్టార్లను ఏర్పాటు చేశారు. 31 వేల మంది భక్తులు స్వామివారి కల్యాణం వీక్షించేలా అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముత్యాల తలంబ్రాలను, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. సీతారాముల కల్యాణం వీక్షించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. రామయ్య కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించారు.