దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయముగా సింహాద్రి అప్పన్న దేవాలయం విరాజిల్లుతోంది. ఇవాళ అక్షయ తృతీయ. ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. స్వామి వారి నిజరూప దర్శనం నేడు భక్తులకు లభించనుంది. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం సంవత్సరానికి 12 గంటలు మాత్రమే భక్తులకు లభిస్తుంది. ఇలాంటి అరుదైన దర్శంన ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ నాడు మాత్రమే భక్తులకు కలుగుతుంది.
మిగిలిన సమయంలో స్వామివారి విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. ఇలా స్వామి వారి నిజరూప దర్శనాన్నే చందన యాత్ర లేదంటే చందనోత్సవం అని పిలుస్తారు. స్వామివారి చందనోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆలయ అనువంశి ధర్మకర్తలైన అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులు తొలి పూజ చేసుకున్నారు. అనంతరం స్వరూపానంద సరస్వతి.. దేవదాయ శాఖ అధికారులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. నేటి తెల్లవారు జామున అంటే మూడు గంటల నుంచే సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తోంది. స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.