జగన్నాథుడికి 35 కలశాలతో అభిషేకం..

ఏ దైవాన్నైనా అష్టోత్తర శతనామాలతో అర్చిస్తే శుభప్రదమని భావిస్తాం. ఆ నేపథ్యంలోనే పూరీ జగన్నాథునికి కూడా 108 కలశాలతో జ్యేష్ఠపూర్ణిమ అభిషేకం నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ ప్రాకారంలోని బావి నీటిని మాత్రమే వినియోగిస్తారు. స్నానవేదికపై ముగ్గురు దేవతలతో పాటు సుదర్శనుణ్ణి కూడా ప్రతిష్టిస్తారు. అనంతరం జగన్నాథునికి 35 కలశాలు, బలరాముడికి 33 కలశాలు, సుభద్రకు 22 కలశాలు, సుదర్శనుడికి 18 కలశాలతో అభిషేకం చేస్తారు. ఈ సమయంలో భక్తులందరూ నేత్రపర్వంగా స్వామివారి అభిషేకాన్ని తిలకిస్తారు. అభిషేకం పూర్తైన వెంటనే దేవతలకు కిరీటాలు ధరింపజేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అభిషేకించిన జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు.

స్నానపూర్ణిమ ఉత్సవం పూర్తైన వెంటనే జగన్నాథుడితో పాటు మిగతా ముగ్గురు దేవతలను ఆలయ ప్రాంగణంలోని ఓ చీకటి మందిరానికి తరలిస్తారు. అందుకు కారణమేమిటీ అంటే నీళ్లలో బాగా తడిసిపోవడంతో స్వామివారికి జలుబూ, జ్వరం వస్తాయని అర్చకులు, భక్తులు విశ్వసిస్తారు. అందుకే దేవతామూర్తులను పదిహేను రోజులపాటు చీకటి మందిరంలోనే ఉంచి ప్రత్యేక సపర్యలు చేస్తారు. నిత్యం సమర్పించే నైవేద్యాలు కాకుండా జలుబు నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేద మూలికలతో సిద్ధం చేసిన వంటకాలనే నివేదన చేస్తారు. ఈ పదిహేను రోజులూ భక్తులకు జగన్నాథుని దర్శనం లభించదు. అందుకు బదులుగా గర్భాలయంలో ఒక పెద్ద పటాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే పట్టచిత్రా అంటారు. సరిగ్గా రథయాత్రకు ముందురోజున చీకటిగదిలో నుంచి మూలమూర్తులను తీసుకువచ్చి గర్భాలయంలో ప్రతిష్టిస్తారు. దీన్నే నవయవ్వన దర్శనంగా వ్యవహరిస్తారు.

Share this post with your friends