శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై (పెద్ద శేష వాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు.
రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. అందుకే శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం తద్వారా దైవత్వంతో పాట పరమపదం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.