భారతీయులు అత్యంత భక్తి భావంతో కొలుచుకునే దేవుడు శ్రీకృష్ణుడు. విష్ణుమూర్తి 8వ అవతారం. ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణుడు అవతరించాడు. అవతార పురుషుడిగా.. శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రముతో కూడిన శ్రావణ బహుళ అష్టమిన అష్టమ సంతానంగా దేవకీ, వసుదేవులకు చెరసాలలో జన్మించాడు. ఆ రోజును శ్రీకృష్ణ జన్మాష్టమిగా అంతా పిలుచుకుంటూ ఉంటారు. ఇక శ్రీకృష్ణుడి లీలలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంద్రుని అహంకారం నుంచి యాదవులను రక్షించేందుకు చిటికెన వేలుపై గోవర్థనగిరిని పైకి ఎత్తాడు. తనను విమర్శించిన వారితోనే పూజలు అందుకున్నాడు.
సృష్టిలో సంభోగం చేయని ఒకే ఒక్క జీవి అయిన నెమలి పింఛాన్ని శిరస్సుపై ధరించి అస్కలిత బ్రహ్మచారిగా కీర్తింపబడ్డాడు. చేతిలో పిల్లన గ్రోవితో కనిపించే కృష్ణయ్య దేవుళ్లందరిలో ప్రత్యేకమనే చెప్పాలి. అపురూపమైన అందానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. అలాంటి కృష్ణయ్య విగ్రహం తాజాగా హైదరాబాద్‌లో లభ్యమైంది. రాంకోఠిలోని గణేష్ ఆలయం పక్కన ఉన్న ఒక ప్రైవేటు కళాశాలలో తవ్వకాలు సాగిస్తుండగా శ్రీకృష్ణుడి విగ్రహం బయటపడింది. దానిని చూసి ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఈ విషయం క్షణాల్లోనే చుట్టు పక్కల ప్రాంతాలకు పాకింది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కృష్ణయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్నారు.