వైభవంగా శ్రీవారి పాదుకల ఊరేగింపు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుగా చెప్పినట్టుగానే తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి బ్రహ్మోత్సవాల మాదిరిగానే నిర్వహిస్తున్నారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదుకలను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చారు.

అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంతప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నాడని పురాణాల ఐతిహ్యం. ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఇతర ఉన్నతాధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends