13 ఏళ్ల చిన్నారికి దక్కిన శబరిమల అయ్యప్పను పూజించే అదృష్టం..

మకర సంక్రాంతి నాడు మకర జ్యోతి దర్శనమిచ్చి లక్షలాది మంది అయ్యప్ప భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం మంగళవారం నాడు లక్షలాది మంది అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. ఆలయ ప్రాంతమంతా అయ్యప్ప స్వామి శరణు ఘోషతో మారుమోగింది. ఏటా మకర సంక్రాంతి నాడు ఓ సంప్రదాయం కొనసాగుతోంది. అదేంటంటే.. అయ్యప్ప స్వామికి అత్యంత భక్తిశ్రద్ధలతో నెయ్యితో అభిషేకం చేస్తుంటారు. ఈ నెయ్యిని కవడియార్ ప్యాలెస్ నుంచి సన్నిధానానికి కన్నె స్వామి తీసుకెళ్లడం ఇక్కడి ఆచారం. అయితే ఈ ఏడాది ఓ విశేషం ఉంది.

అదేంటంటే.. ఈ ఏడాది స్వామివారిని నెయ్యితో అభిషేకించే అదృష్టం ఆదిత్య అనే 13 ఏళ్ల కన్నె స్వామికి దక్కింది. ఆదిత్య వెంట గురుస్వామి బాలసుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. అయ్యప్ప స్వామిని అభిషేకించే ఆదిత్య, గురుస్వామి బాలసుబ్రహ్మణ్యం ఒకరోజు ముందుగానే అభిషేకం నెయ్యితో సన్నిధానానికి చేరుకున్నారు. అనంతరం సంప్రదాయం ప్రకారం నెయ్యితో అయ్యప్ప విగ్రహానికి అభిషేకం చేశారు. ప్రస్తుతం ఆదిత్య 8వ తరగతి చదువుతున్నాడు. స్వామివారి అభిషేకం నెయ్యిని తాను తీసుకెళ్లడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాడు. ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది అయ్యప్పస్వామివారి ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఈ రోజును తానెప్పటికీ మరచిపోలేనని ఆదిత్య తెలిపాడు.

Share this post with your friends