తమిళనాడులోకి కాంచీ పురం గురించి తెలియని వారుండరు. ఇది హిందూ ఆలయాలకు నెలవు. అత్యంత పవిత్ర ప్రదేశం. కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి ఆలయాలు సైతం ఈ కాంచీపురంలో ఉన్నాయి. అందుకే దీనిని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తుంటారు. ఆ ఆలయాల్లో మిక్కిలి పేరుగాంచినది కైలాసనాథ్ దేవాలయం. అలనాటి గొప్ప వాస్తు శిల్పకళకు సైతం ఈ ఆలయం నిదర్శనం. కైలాసనాథ్ అంటే పేరులోనే శివయ్య ఉన్నాడు కదా. ఈ ఆలయం గరళ కంఠుడికి అంకితం చేయబడింది. శివుడు, శ్రీ మహావిష్ణువు, గణేశుడు, సూర్యుడు, దేవి, కార్తికేయులను పూజించేందుకు ఈ ఆలయాన్ని 1300 ఏళ్ల క్రితం నిర్మించారు.
ముఖ్యంగా ఈ ఆలయంలోని శిల్ప సంపదను చూసి భక్తులు మంత్రముగ్దులవుతుంటారు. ఈ ఆలయ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఆలయ నిర్మాణం రాళ్ల ముక్కలతో జరిగిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశేషమేంటంటే.. ప్రధాన ఆలయ సముదాయంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 58 చిన్న ఆలయాలను నిర్మించడం జరిగింది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు ఎడమ వైపున, 6 కుడివైపున యాత్రా స్థలాలు ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే.. ఆలయ గర్భగుడిలో గ్రానైట్‌తో చేసిన భారీ శివలింగం ఉంటుంది. అది చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆలయ గర్భగుడిపై ద్రవిడ శిల్పకళలో ఒక విమానాన్ని నిర్మించారు.