
హిందూమతంలో పర్వతాలకు కూడా ప్రత్యేక స్థానముంది. గోముఖ పర్వతం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. ఇక్కడ గంగోత్రి హిమానీనదం ముగియనుంది. అలాగే గంగోత్రి హిమనీనదం ముగిసిన చోట భాగీరథి నది ప్రారంభమవుతుంది. గోముఖ పర్వతం గర్హ్వాల్ హిమాలయాలలో 4,023 మీటర్లు (13,200 అడుగులు) ఎత్తులో ఉంది. గంగా నదికి ప్రధాన మూలమైన ఈ పర్వతం హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పర్వతం వెనుక ఉన్న హిమనీనదాన్ని భగీరథ పర్వతంగా పిలుస్తారు. ఈ భగీరథ పర్వతంలో మూడు శిఖరాలున్నాయి.
ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వర పర్వతాలని పిలుస్తారు. అయితే గోముఖ పర్వతంలో చాలా మార్పులు వచ్చాయని తెలియజేస్తారు. ఎందుకంటే ఈ పర్వతం నిరంతరం కదులుతూ ఉంటుందట. అది కదిలే వేగం విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టతా లేదు. అసలు దీనికి కారణం ఏంటనే విషయంలో కూడా స్పష్టత లేదు. 2013 విపత్తు కారణమా? లేదంటే మరేదైనా కారణముందా? అనే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్టోగ్రతలే కారణమని నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా హిమాలయాలలోని హిమనీనదాలను డెహ్రాడూన్‌లో ఉన్న వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ సంస్థ పర్యవేక్షిస్తోంది.
