కృష్ణుడిని మింగిన కొండ చిలువ ఎవరు? మింగిన తర్వాత ఏమైంది?

భాగవతంలో బాల కృష్ణుడు ఎంతో మంది రాక్షసులను సంహరిస్తాడు. వారిలో ‘అఘుడు’ ఒకడు. ఒకసారి బలరామకృష్ణులు స్నేహితులతో కలసి ఒక ఉద్యానవనంలో ఆటలాడుకుంటున్నారు. అలా పిల్లలందరూ ఆటపాటల్లో మునిగివున్నప్పుడు ‘అఘుడు’ అనే రాక్షసుడొకడు అక్కడికి వచ్చాడు. అతను కంసుని దగ్గర పనిచేస్తాడు. బకుడనే రాక్షసుడికీ, పూతన అనే రాక్షసికి తమ్ముడు. తన సోదరులు ఒక గొల్లపిల్లవాని చేతిలో హతులయ్యారని తెలుసుకుని, ఎలాగైనా ఆ పిల్లవాడి అంతు చూడాలనుకుని అక్కడికి వచ్చాడు.

బలరామకృష్ణులను చూడగానే ‘వీళ్ళే నా అన్నల ప్రాణాలు తీసి వుంటారు’ అనే నిర్ణయానికి వచ్చాడు అఘుడు. వెంటనే ఆమడ పొడవూ, కొండంత లావూ ఉన్న కొండచిలువ రూపం ధరించి, పెద్ద గుహ మాదిరిగా నోరు తెరిచి కృష్ణుడిని మింగేసేందుకు ఒకచోట పొంచి వున్నాడు. ఆ కొండచిలువను చూసి కూడా గోపబాలురు భయపడలేదు. ‘మన కృష్ణయ్య వుండగా మనకేం భయం’ అనుకుని దాని దగ్గరకు వెళ్ళారు. బిలం మాదిరిగా వున్న దాని నోట్లోకి ఒక్కొక్కరే నడిచివెళ్ళారు. కాని, కొండచిలువ వాళ్ళనేమీ చెయ్యలేదు. కృష్ణయ్య కోసం వేచి ఉంది కాబట్టి కదలకుండా మెదలకుండా అలాగే వుంది. బాలకృష్ణుడు దూరం నుంచి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. అది భయంకరమైన కొండచిలువ అని తెలిసి కూడా గొల్లపిల్లలు తనమీద విశ్వాసంతో దాని నోట్లోకి ప్రవేశించారనీ, అది తన కోసమే వేచి ఉన్నదనీ కృష్ణయ్యకి తెలుసు.

తన స్నేహితులకు చేటు కలగకుండానూ, కొండచిలువ కోరిక నెరవేరకుండానూ ఉండే ఉపాయం ఏమిటా అని ఒక్కక్షణం ఆలోచించాడు. ఆ తరువాత తను కూడా దాని నోట్లోకి వెళ్ళాడు. అలా వెళ్ళిన నల్లనయ్య ఆ కొండచిలువ గొంతులోనే ఆగి తన శరీరాన్ని మహాద్భుతంగా పెంచుకున్నాడు. దాంతో ఆ కొండచిలువ గొంతు పూడిపోయింది. ఊపిరి ఆడే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది. గిలగిల కొట్టుకుంది. తల నేలకేసి బాదుకుంది. కాసేపటికి దాని తల పగిలిపోయింది. పగిలిన శిరస్సులోంచి గోపబాలురతో సహా కృష్ణయ్య బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుని దివ్యశరీర స్పర్శ మూలంగా పాపాలన్నీ హరించుకు పోవడం వల్ల ఆ కొండచిలువలోంచి ఒక మహా తేజస్సు బయటకువచ్చి కృష్ణయ్యలో లీనమైపోయింది.

Share this post with your friends