
అఘుడు కొండ చిలువగా మారి శ్రీకృష్ణుడిని మింగాలని వెళ్లిన కథ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం కదా.. నోటిని బిలం మాదిరిగా తెరచి ఉండటంతో గోపబాలురంతా దాని నోట్లోకి ప్రవేశించారు. అఘుడు మాత్రం బాల కృష్ణుడి కోసం నోటిని తెరిచే ఉంచాడు. కన్నయ్య కాసేపు ఆలోచించి కొండ చిలువ నోటిలోకి వెళ్లి తన శరీరాన్ని పెద్దగా చేయడంతో.. తల నేలకేసి బాదుకుని మరీ చనిపోయింది. శ్రీకృష్ణుడి దివ్య శరీర స్పర్శ కారణంగా పాపాలన్నీ హరించుకుపోయి కన్నయ్యలో లీనమైపోయింది. కృష్ణయ్యలో అలా లీనమైన అఘుడు పూర్వం శంఖుడనే రాక్షసుని కుమారుడు. అఘుని బలసంపద అమోఘంగా ఉండేది.
దానికి తోడు అతని రూప లావణ్యాలు, యవ్వనం అతనిని గర్విష్టిగా తయారుచేశాయి. అతనొకసారి మలయాద్రి మీద తపస్సు చేసుకుంటున్న అష్టావక్రుని చూశాడు. వంకర టింకరగా వున్న ఆయనను చూసి అపహాస్యం చేశాడు. అష్టావక్రుడు ఆగ్రహించాడు. ‘నువ్వు సర్పరూపం ధరిస్తావు’ అని అఘుడిని శపించాడు. అఘుడు తన తప్పు తెలుసుకుని అష్టావక్రుడి పాదాలమీద పడ్డాడు. పశ్చాత్తప్తుడైన అఘుని చూసి జాలిపడి ‘శ్రీకృష్ణుడు ఎప్పుడు నీలో ప్రవేశిస్తాడో అప్పుడు నీకు శాపవిముక్తి కలుగుతుంది’ అని చెప్పాడు అష్టావక్రుడు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఎప్పుడు కనిపిస్తాడా, ఎప్పుడు ఎలా ఆయనను మింగి శాపవిముక్తిని పొందుతానా అని అఘుడు తపించసాగాడు. కాలక్రమేణా అతను బృందావనం చేరుకుని శ్రీకృష్ణుని అనుగ్రహం ద్వారా శాపవిముక్తి పొందాడు.
