మహాభారతంలో కుంతీదేవి సహనానికి మారుపేరు. కుంతి యాదవుల ఆడబిడ్డ. వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణుని మేనత్త. ఆమె అసలు పేరు పృధ. కుంతిభోజుడనే రాజు సంతానము కనుక ఈమెకు కుంతీదేవి అనే పేరు వచ్చింది. ఆమె కుంతిభోజుని కుమార్తె కాదు, శూరసేనుడి కుమార్తె. అందుకే శ్రీ కృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు. అసలు తండ్రి పెట్టిన పేరు పృథ. కుంతి భోజుడు పెంచుకున్నాడు. కాబట్టి కుంతీదేవి అయింది. ఆమె దైవభక్తి, గురుభక్తి, మెచుకోదగ్గవి. ఆ ఇంట్లో కుంతి అంటే ఎంతో అనురాగం వెల్లివిరిసేది.

తన తండ్రి కుంతిభోజుడు తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కూతురుని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించి.. పరిచర్య చేయించేవాడు. భారతం చదివితే ఆమెలో ఎన్ని ఉత్థానపతనాలు, ఎంత సహనం, ఎన్ని గొప్ప లక్షణాలు… ఆశ్చర్యమేస్తుంది. అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారు ఎవరి క్షేమసమాచారం గురించి తెలుసుకోవాలనుకున్నారో తెలుసా? కుంతీదేవిని గురించి. అంతటి భీష్ముడు ఒకమాటన్నారు. “అసలు ఆ కుంతీదేవిలాంటి స్త్రీ లోకంలో ఉంటుందా? ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచిందో, మహా ఔన్నత్యం కల తల్లి” అన్నారు. కుంతీదేవి చిన్ననాటి నుంచే అలా అందరి మన్ననలూ పొందింది.
