తల్లి దేవకి కోరికను మన్నించిన శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే..

మద్వాచార్యుల వారు వ్యాపారి నుంచి తీసుకున్న చందనం గడ్డలను కరిగించగానే ఒకదాని నుంచి శ్రీకృష్ణుడి విగ్రహం, మరొక గడ్డ నుంచి బలరామ విగ్రహం బయటపడింది. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, శ్రీ కృష్ణుని విగ్రహం తీసుకుని, ఉడిపికి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత, ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే, ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృతరూపము అయినటువంటి శ్రీ కృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ శ్రీ కృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి? వాస్తవానికి జరిగిందేంటి? అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఆ శ్రీకృష్ణుని విగ్రహం, సామాన్యమైనదికాదు.

ఒకసారి దేవకీదేవి, “కృష్ణా.. నీ బాల్య లీలలు చూసే భాగ్యం, యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. వాటి గురించి వినీ, వినీ, ఎప్పటికైనా చూడాలని, నా మనస్సు ఉవ్విళూరుతోంది. చూపించవా కృష్ణా” అని ప్రార్థించింది. కృష్ణుడు అనుగ్రహించాడు. మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటగులు వేస్తూ నడిచాడు. దేవకీ దేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని తాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. ఒంటినిండా రాసుకున్నాడు. పామును తాడులాగా పట్టుకుని, మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా, తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. ఈ చేష్టలను చూసి దేవకీ దేవి పరవశించి, మైమరచిపోగా, ఇదంతా గమనిస్తున్న రుక్మిణీ, తన పతి దేవుని శైశవ రూపాన్ని, ప్రపంచమంతా చూసి తరించాలని భావించి, వెంటనే విశ్వకర్మను పిలిపించి, ఆయా రూపాల్లో, శైశవ కృష్ణుడూ, బలరాముని విగ్రహాలను చేయించింది.

Share this post with your friends