కుంతికి దుర్వాసుడు మంత్రోపదేశం చేయడం వెనుక కారణమేంటంటే..

ఒకనాడు కుంతీదేవి తండ్రి కుంతిభోజుడు సభలో కొలువై ఉన్నాడు. ఆకస్మికంగా దుర్వాసుడనే ఋషి అక్కడకు వచ్చాడు. ఆయన రుద్రాంశ సంభూతుడు. ఆయనను చూస్తే అందరికీ భయమే, ఆయనకు కోపం ముక్కుమీదే ఉంటుంది. ఆయన శపిస్తే తిరుగు లేదు. అటువంటి చండప్రచండుడైన ఋషికి ఆతిద్యమివ్వాలి. సపర్య చేయాలి. ఆ భారం కుంతిపై పడింది. తండ్రి బిడ్డ శిరస్సు నిమిరుతూ “తల్లీ! నీ ఓర్పుకిది గీటురాయి” అన్నాడు. కుంతి ఆనందంతో, అరమోడ్పు కన్నులతో ” నాన్నా! మహర్షులకు సేవ చేసే భాగ్యం అందరికీ కలసి వస్తుందా? దుర్వాసుని సేవ నా జీవితానికి వెలుగు తోవ” అంటూ నమస్కరించి దీవెనలు పొందింది.

కుంతికి దుర్వాసుడు మంత్రోపదేశం చేయడం వెనుక కారణమేంటంటే..
కుంతికి దుర్వాసుడు మంత్రోపదేశం చేయడం వెనుక కారణమేంటంటే..

దుర్వాసునడు కుంతిభోజుని ఇంట ఒక సంవత్సర కాలం పాటు ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళతాడో, ఏ వేళకు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క సారి ఫలానా ఆశ్రమానికి వెళుతున్నాను, రేపు సాయంత్రానికి తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి, ఆ రోజు అర్ధరాత్రికి తిరిగి వస్తాడు. వచ్చాడంటే, రానీలే, అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, చాప ఉంది, తాగి పడుకుంటాడులే అనుకుంటానికి వీలు లేదు. ఫలహారమేమైనా ఉందా? అంటాడు. పండ్లు గట్టిగా ఉంటే పచ్చివంటాడు, మెత్తగా ఉంటే కుళ్ళినవంటాడు, విసిరి మొహాన కొడతాడు. అటువంటి మహానుభావుడికి కుంతి పరిచర్య చేసింది. ఓర్పులో భూదేవి వంటిదనిపించుకుంది. మునీశ్వరుని మనసు కరిగింది.

” బిడ్డా! నీ పరిచర్య నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నీకు ఏమి కావాలయునో అడుగు ఇస్తాను” అన్నాడు. కుంతికి ఏ కోరిక లేదు. అవ్యాజంగా సేవ చేసింది. “మహాత్మా! నాకు కావలసింది ఏముంది? మీరు ప్రసన్నులయ్యారు. అదే నాకు పదివేలు, నా తండ్రి సంతోషిస్తాడు” అని నమస్కరించింది. అప్పుడు ముని.. ” నీవు పసిదానవు. నీకు తెలియదు, అడగలేకున్నావు, నీకు ఒక మంత్రాన్ని ఇస్తాను తీసుకో. నీవు ఏ దేవుడిని పిలిస్తే ఆ దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీకు వరాన్ని ప్రసాదిస్తాడు”. కుంతి మారాడకుండా మహా ప్రసాదమని మంత్రమును స్వీకరించింది. కుంతికి మంత్రోపదేశము చేసి, కుంతీభోజుని ఆశీర్వదించి దుర్వాసుడు తన దానిన తాను వెళ్ళిపోయాడు.

Share this post with your friends