అడవిలో కాషాయాంబరధారులై వస్తున్న రామలక్ష్మణులను చూసి శత్రువులుగా భావించాడు సుగ్రీవుడు. హనుమంతుడు ధైర్యంగా వారికి ఎదురెళ్లి కలిసి మాట్లాడి వెంట పెట్టుకుని వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలిపించాడు. ఎదుటివారికి ఒక విషయం చెప్పేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతాడు హనుమ. మాటలు అసందర్భంగా దొర్లనివ్వడు. ప్రధానంగా ఇది గమనించే శ్రీరామచంద్రుడు ఆయనను దూతగా నిర్ణయించుకున్నాడు. రాజహృదయం, ధర్మనీతి, కార్యసిద్ధి మెదలైనవి దృష్టిలో పెట్టుకోగలిగిన మేధావి మాత్రమే దూత కాగలడు. అశోకవనంలో సీతమ్మను గుర్తించి, ఆమెకు రాముడి ప్రేమను ప్రకటించి ఓదార్చాడు.

రావణుడి సమక్షంలో శ్రీరాముడి వీరత్వాన్ని విడమరిచి చెప్పి అతడి గుండెల్లో ప్రకంపనలు సృష్టించి అధైర్య పరచాడు. పాలకుడు అధర్మపరుడైతే అతడికి, అతడి రాజ్యానికి అరిష్టం. స్త్రీని శోకింపచేస్తే మహాజ్వాలగా లేచి భస్మం చేస్తుంది. పర స్త్రీని చెరపట్టినవాడు ఎంతటి పరాక్రమవంతు డైనా పతనం తప్పదు. ఎంతటి భక్తిపరుడైనా దైవం సహకరించదు- అంటూ నర్మగర్భంగా హెచ్చరించాడు. సీతమ్మ తల్లితో ‘అమ్మా! వానరసేనలో నాకంటే అధికులు, నాతో సమా నమైనవారు చాలామంది ఉన్నారు. నాకంటే అల్పుడు ఒక్కడు కూడా లేడు’ అంటూ తనను తాను తగ్గించుకుని సీతమ్మకు ధైర్యం చెప్పాడు. ఏ కార్యమైనా సాధించగలననే ధైర్యం హనుమలో అణువణువునా నిండి ఉంది. నిజంగానే అంతటి సమర్థుడు కూడా.
