
ఆశ్వయుజ శుక్లపక్షం తొమ్మిది రోజులనూ దసరా లేదా దేవీ నవరాత్రులు అంటారు. చివరి మూడు రోజులు ప్రత్యేకంగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ మూడు రోజులకూ అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజుల్లో విద్యార్థులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్ల పూజ, క్షత్రియులు ఆయుధ పూజ చేసి అమ్మవారి కృపను పొందుతారు. పురాణాల్లో రాజులు దేవి మహిషాసురమర్దనిగా విజయం సాధించిన స్ఫూర్తితో ఈ రోజునే దండయాత్రలు ప్రారంభించేవారని చెప్పబడింది.
అసలు పరికరాలను పూజించే సంప్రదాయం ఎలా మొదలైందో తెలుసా? దుర్గాష్టమి నాడు అమ్మవారు లోహుడు అనే రాక్షసుడిని సంహరించగా లోహ పరికరాలను పూజించే ఆచారం ప్రారంభమైంది అని చెబుతారు. “దుర్గ” అంటే – దుర్గతులను తొలగించేది. ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం. ‘గ’ అంటే వాటిని నశింపచేసేది. అందుకే ఈరోజు దుర్గాసహస్రనామ పారాయణం, “దుం” బీజాక్షరంతో అమ్మవారి పూజ ప్రత్యేకం. ఈసారి దుర్గాష్టమి మంగళవారంతో కలవడంతో మరింత శ్రేష్టత ఉంది.
