అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురం సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో పూజారులంటూ ఎవరూ ఉండరు. స్థానిక రైతులు, మహిళలు కొందరు కలిసి శ్రీ విద్యా పూజా విధానాన్ని నేర్చుకుని ఇక్కడ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయంలో తొలి ప్రాధాన్యం రైతులకు ఉంటుంది. అయితే ఎవరైనా పూజాలుగా వ్యవహరించవచ్చు. శివాలయంలో ఒకేసారి 1000 మంది కూర్చుని పూజలు చేసుకునేలా శివలింగాలుంటాయి. అలాగే ఈ క్షేత్రంలో నిత్యపూజలతో పాటు చండీహోమం, నవావరణ అర్చన, రుద్రాభిషేకం వంటివి నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకుని ఏం కోరుకున్నా జరుగుతుందట.

ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తికమాసం, దేవీనవరాత్రుల సమయంలో పెద్దఎత్తున విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మాయిల కోసం గురుకుల పాఠశాల కూడా ఉంది. అదే అమృతకన్య గురుకుల పాఠశాల. శ్రీ విద్యా ట్రస్టు నేతృత్వంలో ఈ పాఠశాల నడుస్తోంది. ఔత్సాహికులకు చదువుతోపాటు అమ్మవారి సాధనపట్ల కూడా అవగాహన సైతం కల్పిస్తారు. అలాగే మహిళలకు పలు అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఆర్థికంగానూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వెళ్లాలంటే అనకాపల్లికి వెళ్లి అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో గుడికి చేరుకోవచ్చు.
