కార్తిక మాసంలో అయ్యప్ప స్వామి భక్తులంతా మాలధారణ గావిస్తారు. 40 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో.. నిష్టగా ఉండి.. అనంతరం శబరిమల వెళ్లి ఇరుముడి అప్పగించి వస్తారు. ఇరుముడి అంటే రెండు ముడులు లేదా ముడుపులు అని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగం.. నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరువత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మకాయ, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పైపెంకు నూరిన కొబ్బరికాయలు మూడు ఉంటాయి.

రెండవ భాగం.. యాత్రలో అవసరమైన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వంటి వస్తువులు, రైక ముక్కలు. భక్తి, శ్రద్ధ అనే రెండు భాగాలు కలిగిన ఈ ఇరుముడిలో, భక్తి భాగంలో ముద్ర కొబ్బరికాయను ఉంచి, శ్రద్ధ భాగంలో తాత్కాలిక అవసరాల కోసం ద్రవ్యములు ఉంచుతారు. భక్తి, శ్రద్ధలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఓంకారం ఉంటుందనే సూత్రానికి గుర్తుగా.. ఇరుముడిని ఓంకార త్రాటుతో బిగించి కడతారు. ముద్ర సంచిలో గురుస్వామి మూడు సార్లు బియ్యం వేయడం ద్వారా, భక్తులు మూడు విధాల విఘ్నాలు.. ఆధిదైవిక (వర్షం, మెరుపు), ఆధిభౌతిక (భూకంపం, అగ్ని), ఆధ్యాత్మిక (భక్తి లేమి, అరిషడ్వర్గాలు).. వీటిని అధిగమించగలరని నమ్ముతారు.
