దేశంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి టాప్‌లో ఉంటుంది. కలియుగ వైకుంఠంగా భక్తులు పిలుచుకునే వేంకటేశ్వరుని సన్నిధి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని తిరుమల కొండపై వేంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ వేంకటేశ్వర స్వామి వారిని భక్తులు వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామి విశిష్టతలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారిని కోరుకున్న కోరిక ఏదైనా సరే తప్పక నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. అయితే స్వామి వారి కన్నులు ఎప్పుడూ మూసివేసే ఉంటాయి. దానికి కారణమేంటి?
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్లు చాలా శక్తివంతంగానూ.. ప్రకాశవంతంగానూ ఉంటాయట. భక్తులు ఆయన కళ్లలోకి నేరుగా చూడలేరట. విశ్వశక్తికి మించినవట ఆయన కళ్లు అని పండితులు చెబుతుంటారు. అలాంటి కళ్లలోకి మానవ మాత్రులం చూడలేం కాబట్టి శ్రీ మలయప్ప స్వామి వారి కళ్లను మూసి ఉంచుతారని అంటారు. ఒక్క గురువారం మాత్రం స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. ఆ రోజున మాత్రమే వేంకటేశ్వర స్వామి వారి నేత్రాలను మనం చూడగలం. మిగిలిన రోజుల్లో పచ్చ కూర్పూరంతో స్వామివారి కన్నులను కప్పి ఉంచుతారు.