నారదునికి సంగీతం నేర్పిన ఉలూకపతి ఎవరు?

నారదుడు నారాయణుడి సలహాతో సంగీతం నేర్చుకునేందుకు గానబంధును కలిశాడని తెలుసుకున్నాం కదా. ఆయన వినయం, సంగీత పాఠవాన్ని చూసిన నారదుడు ఆశ్చర్యపోయాడు. ఆయన ఎవరైతే ఏంటి? తనకు సంగీతం కావాలి. కాబట్టి తనకు దివ్యగాన విద్యను ప్రసాదించమని కోరాడు. అయితే నారదుడు తానెవరో తెలుసుకోవాలనుకుంటున్నాడని గ్రహించిన గానబంధు తన గురించి ముందుగా వివరించాడు. పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు ధర్మవర్తనుడై ఉండేవాడు. సద్గుణ సంపన్నడనైన సదరు రాజు సంగీతాన్ని మాత్రం ఎందుకో నిషేధించాడు. గానాలాపన చేసిన వారికి మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు.

ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరచి భగవంతుని కీర్తిస్తూ గానం చేసాడు. ప్రజలు కూడా ఆయన గానమాధుర్యంలో మునిగిపోయారు. అయితే ఆ గానాన్ని విన్న రాజభటులు అక్కడకు చేరుకుని బ్రహ్మణ హత్య మహా పాతకం కాబట్టి మరణశిక్షతో సమానమైన రాజ్య బహిష్కరణ చేశారు. కొంత కాలానికి రాజు మరణించాడు. తిరిగి ఆయన గుడ్లగూబగా జన్మించాడు. దివ్యాంధ జన్మ కావడంతో రాత్రి పూట ఆహారం సమకూర్చుకోవాలి. కానీ అది అతి పెద్ద సమస్యగా మారింది. రోజులు గడుస్తున్నా రాత్రిళ్లు ఆహారం లబించలేదు. ఆకలితో మరణాన్ని ఆశ్రయించగా.. పూర్వ జన్మ సుకృతంతో యముడు వచ్చి ఎదురుగా నిలిచాడు. తనను తీసుకెళ్లమని గుడ్లగూడ ప్రాథేయపడింది.

తప్పేంటో తెలియకుండా శిక్ష అనుభవించడం ధర్మం కాదని.. అప్పుడు అతని పూర్వ జన్మ గురించి యముడు చెప్పాడు. యముడు చెప్పింది విన్నాక తను చేసిన తప్పు తెలుసుకుని దాని నుంచి బయటపడే మార్గం చూపించమని కాళ్లపై పడ్డాడు. ఉలూక రాజా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఆ గుహలో నీ దేహముంది. దాని నుంచి కొంత మాంసాన్ని చీల్చుకుని తింటే నీకు శుభం జరుగుతుందని చెప్పాడు. అలా తన శవం వద్ద కూర్చొని తింటుండగా ఓ బ్రహ్మణుడు చూసి ఆ దేహం ఎవరిదో గుర్తించి ఆశ్చర్యపోయాడు. ఆ బ్రహ్మణుడు మరెవరో కాదు.. ఉలూకపతి బహిష్కరించిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి క్షమించమని అడిగాడు. అప్పుడు హరిమిత్రుడు ’నీవు నా పట్ల చూపించిన కాఠిన్యానికి నేను ఆ రోజే మరణించాను. నువ్వు అనుభవించిన బాధ చాలు. నీకు బాధ లేకుండుగాక. గొప్ప సంగీత విధ్వాంసుడివై లోకంలో ఉత్తమ సంగీత విద్యను అందిస్తావు’’ అని దీవించాడు. అదీ ఉలూకపతి కథ.

Share this post with your friends