
11వ పాశురము దాని అర్థం ఏమిటనేది తెలుసుకున్నాం కదా. దీనికి సంబంధించిన అవతారిక గురించి తెలుసుకుందాం. అన్ని విషయములందును, అగ్ని విధములందును శ్రీకృష్ణునితో సరిసమానమైన ఒక గోపికామణిని, ఈ పదకొండవ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు. శ్రీ కృష్ణుడు ఆ ఊరిలోని వారికందరకు అన్నివిధాలా ఆరాధ్యుడు. ఆదరణీయుడు. అట్లే ఈ గోపిక కూడ అతనితో సమానముగా ఆరాధ్యురాలు. ఆదరణీయురాలు. ఈమె తాను పలికే పలుకు, చేసే పనులు అన్నీ భగవదారాధనగాను, భాగావత్కైంకర్యంగాను వుండాలని భావిస్తూ ఆచరించే గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది.
భగవత్వరం కానిది ఏదీ వుండరాదని యీమె భావన. అందువల్ల యీమె భావానికి తగినట్లు భగవచ్చింతనలోనే వుండటం వలన ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి వుంటుంది. అందులోనే తాదాత్త్మ్యం చెందుతూ వుంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే వుండటాన బాహ్యమైనవేవీ వినపడవు. కనపడవు. పట్టించుకోదు. ఈమె అతిలోక సుందరి. అందరినీ ఆకట్టుకొనే సౌందర్యం. అలనాడు శ్రీరాముడు పురుషులనే మోహింప చేసినట్లు యీమె స్త్రీలనే మోహింపచేయగల సౌందర్యరాశి. సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే మోహింపచేసిన యీమెను (యీ మాలికలో) మేల్కొలుపుతున్నారు.
