ఆ గ్రామంలో గ్రాండ్‌గా శ్రీరామనవమి జరుపుకుని ఆపై ఏం చేస్తారో తెలిస్తే..!

ఆ గ్రామంలో శ్రీరామనవమి ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఊరు ఊరంతా రామభక్తులే. వాస్తవానికి శ్రీరామనవమి రోజున దేశమంతా మందుకి, ముక్కకి దూరంగా ఉంటుంది. కానీ ఈ గ్రామంలో రివర్స్. ఒకవైపు అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం చేస్తూనే మరోవైపు కోళ్లు, మేకలను పెద్ద ఎత్తున కట్ చేస్తారు. వందల ఏళ్లుగా ఇది ఆచారంగా వస్తోంది. దీనికి కూడా ఓ కథ ఉంది. ఇంతకీ ఆ గ్రామం ఏంటంటారా? తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం.

నవమి ముందు రెండు రోజులు.. తరువాత రెండు రోజులు.. మొత్తంగా ఐదు రోజుల పాటు సీతారాంపురంలో వేడుకలు జరుగుతాయి. సీతరామచంద్రస్వామి వారి ఆలయం ఉన్నందునే ఆ గ్రామానికి సీతారాంపురం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో సీతారామ, లక్ష్మణ, హనుమంతుడు ఉన్నారు. అలాగే వీరితో పాటు సంతాన గోపాలస్వామి, ఆండాలమ్మ, గోదాదేవి, గరుత్మంతుడు కొలువై ఉన్నారు. పిల్లలు లేని వాళ్లు తడిబట్టలతో ఈ ఆలయ ప్రదక్షిణ చేసి.. గోపాలస్వామిని దర్శించుకుంటే సంతానం పక్కాగా కలుగుతుందని గ్రామస్తుల నమ్మకం. ఇక్కడి వారు రాముల వారి కల్యాణాన్ని తమ ఇంట వివాహంగా భావించి పెద్ద ఎత్తున బంధువులను ఆహ్వానించి కోళ్లు, మేకలు కోసం వండి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గ్రామంలో ఇప్పటి వరకూ వడగండ్ల వానంటే ఏంటో తెలియదట. అదంతా దేవుని దయేనని వారి నమ్మకం.

Share this post with your friends