
దేవకి ఆరాధనలోని ఆంతర్యాన్ని గ్రహించిన వసుదేవుడు ఆ మర్నాడు.. నీలి మేఘ శ్యాముని ప్రతిరూపంగా ఓ నల్ల పాలరాతి విగ్రహాన్ని తెచ్చి ఆమెకిచ్చాడు.
అందుకెంతో సంతోషపడిన ఆమె, తన ఆరాధనను, ఆ విగ్రహంతో ప్రారంభించింది. ప్రాణప్రదం చేసుకుంది. దానికి ఘనశ్యాముడని పేరు పెట్టుకుని మురిసిపోసాగింది. ఆ బొమ్మ అందులోని ఆమె ఆనందం, దేవకి వసుదేవులకు, గర్గులవారికి తప్ప మరెవ్వరికి తెలీదు. అక్కడ గోకులంలో తన పిల్లవానికి నామకరణ మహోత్సవం, నంద యశోదలు చేయదలిచారు.
దానికి తగ్గట్లుగానే నందుని భవంతి, సభా ప్రాంగణం వగైరాలు అలంకరిస్తున్నారు. అద్భుత శోభలతో, మామిడి తోరణాలు, అరటి చెట్లతో అందరిని ఆహ్లాద పరుస్తోందా వాతావరణం. కులగురువులు గర్గాచార్యులవారు, తమ పరివారంతో నందుని ఇంటికి వచ్చారు. కుల గురువులను మేళతాళాలతో సాదరంగా ఆహ్వానించారు. నందుడు, కులగురువులను విలువైన బహుమతులతో గౌరవించాడు. యశోద తన ముద్దుల పిల్లవాడిని తెచ్చి కులగురువుల చేతిలో ఉంచింది.
గర్గులవారు తన అదృష్టంగా ఆ పిల్లవాడిని స్వీకరించి, పూజ చేయించారు. పాలు, తేనె నాకించారు. ఆచార వ్యవహారాల మధ్య ఆ బాలునకు “కృష్ణు”డని నామకరణం చేశారు. ఇలా కృష్ణుని నామకరణం జరిగింది.
