ఐదు రోజుల పాటు భక్తిలో మునిగి తేలే గ్రామం మన తెలంగాణలో ఉందని తెలుసా?

భగవంతుడి కోసం ఒక గంట కేటాయించడమే కష్టమైపోతున్న తరుణంలో ఆ ఊరు ఊరంతా ఏకంగా ఐదు రోజుల పాటు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంటుంది. ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా? మన తెలంగాణలోనే ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కాప్సి(బి) అనే గ్రామం. ఈ గ్రామంలో ప్రతి ఏడాది ఉగాది పండుగ మొదలు ఐదు రోజుల పాటు ఒక చోట చేరి అక్కడే సహపంక్తి భోజనాలు చేస్తూ భక్తి కార్యక్రమంలో నిమగ్నమవుతారు. అసలు వారంతా ఎందుకలా చేస్తున్నారు? దాని వెనుక కథేంటో తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా నేరి గ్రామానికి చెందిన నానాజీ మహరాజ్ విఠల్ అనే వ్యక్తి పాలేరు పని చేసుకుంటూ నిత్యం దైవ చింతనలో ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆయన గ్రామగ్రామాలు తిరిగేవాడు. అలా ఒకరోజు పెద్ద కాప్సి గ్రామానికి వచ్చాడు. ఆయన వచ్చింది మొదలు గ్రామం పూర్తిగా మారిపోయిందట. ఆయన తాత్విక బోధనలతో చాలా మంది శిష్యులుగా మారి మద్యం, మాంసాహారం మానేశారట. అయితే లక్ష్మణ్ పాటిల్ అనే వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు.ఎక్కడికి వెళ్లినా నయం కాలేదట. ఒకరోజు మహరాజ్ గురించి తెలుసుకుని పెద్ద కాప్సికి వెళ్లగా పది రోజుల్లో అనారోగ్యం మాయమైందట. ఇక అంతే.. మహరాజ్ దేవతాముర్తిని.. ఆంజనేయస్వామి ఆలయం పక్కనే నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రతి ఏడాది ఉగాది నుంచి ఐదు రోజుల పాటు జనం ఒకచోట చేరి పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 9న ఉగాది పండుగ సందర్భంగా మొదలైన పూజలు నేటితో ముగియనున్నాయి.

Share this post with your friends