వేయి స్తంభాల ఆలయం చాలా ఫేమస్. దీని గురించి అందరికీ తెలిసిందే. ఎక్కడుంది.. ఏంటి.. దాని కథా కమామీషు మొత్తం మనకు తెలుసు. కానీ వంద స్తంభాల ఆలయం కూడా ఉందని తెలుసా? తెలిసినా చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. నవాబులు, కొందరు రాజుల పాలనలో చాలా గుళ్లు నేల మట్టమయ్యాయి. ఈ ఆలయమైతే చెక్కు చెదరకుండా మన చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. వంద స్తంభాల ఆలయం ఎక్కడో కాదు.. మన తెలంగాణలోనే ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్ బస్టాండ్‌కు కిలోమీటర్ దూరంలో ఉద్ మీర్ గల్లీలో ఈ ఆలయం ఉంది. దీనిని ఇంద్ర నారాయణ ఆలయంగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు.
915 నుంచి 927 మధ్య కాలంలో బోధన్ ప్రాంతాన్ని రాష్ట్రకూట చక్రవర్తి అయిన మూడో ఇంద్ర వల్లభుడు పాలించాడు. ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాతి కాలంలో ఈ ఆలయంలో గరుడ ధ్వజ ప్రతిష్టాపన జరిగింది. మహ్మద్ బీన్ తుగ్లక్ దండయాత్ర కారణంగా ఆలయంలోని కొన్ని విగ్రహాలైతే దెబ్బతిన్నాయి కానీ అపురూపమైన శిల్ప సంపద మాత్రం చెక్కుచెదరలేదు. ఆలయంలో చెక్కిన ఏనుగులు, పద్మాలను ఎంత చూసినా తనివి తీరదట. అయితే విగ్రహాలు లేకపోవడంతో ఈ ఆలయాన్ని ఎవరూ సందర్శించడం లేదట. ఆలయం రోజురోజుకూ రూపు రేఖలు మారిపోతున్నాయట.