
ప్రస్తుతం మనం శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలోని చెరసాల గురించి తెలుసుకుంటున్నాం కదా. దీనికి సంబంధించిన భాగవత గాథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. భాగవతం ప్రకారం.. తన సోదరి దేవకీ, వసుదేవుల అష్టమ సంతానం చేతిలో తనకు మరణం సంభవిస్తుందని ఆకాశవాణి ద్వారా కంసులు తెలుసుకుంటాడు. వెంటనే దేవకీ వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. దేవకికి జన్మించిన సంతానాన్నంతా కంసుడు హతమారుస్తూ ఉంటాడు. అష్టమ గర్భంలో కృష్ణుడు జన్మించినప్పుడు చెరసాల తలుపులు యోగమాయతో తెరుచుకోవడం, కాపలాదారులు గాఢ నిద్రలోకి జారుకోవడం వంటివి జరుగుతాయి.
అప్పుడు వసుదేవుడు కృష్ణుడిని గంపలో పెట్టుకుని, గంపను శిరసుపై ఎత్తుకుని ఎంతో ప్రయాసతో యమునా నదిని దాటి బృందావనానికి తీసుకువెళతాడు. అక్కడ నందవ్రజంలో నందుడు, యశోద దంపతులకు పుట్టిన ఆడపిల్లను తీసుకుని, కృష్ణుని యశోద పక్కన పడుకోబెట్టి వసుదేవుడు తిరిగి మధురకు వస్తాడు. ఆ తరువాత దేవకి ప్రసవించిన విషయం కంసుడికి తెలుస్తుంది. ఆ శిశువును చంపేందుకు కంసుడు యత్నించగా.. ఆ శిశువు.. ‘నిన్ను సంహరించేవాడు గోకులానికి చేరాడు’ అని చెప్పి అదృశ్యమవుతుంది. ఆ చెరసాలే.. ఇప్పుడు మధురలోని ఆలయంలో ఉన్న చెరసాల అని చెబుతారు.
