భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని టీటీడీ ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. భారత 76వ గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ప్రసంగించారు. వారి మాటల్లోనే…. ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మికసంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు, భక్తులకు ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్య్రానంతరం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈ పర్వదినం రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
శ్రీవారి ఆలయం :
– టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా, నిర్వహిస్తున్నాం.
వైకుంఠ ఏకాదశి :
– వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 7 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించాం.
విజయవంతంగా బహ్మోత్సవాలు :
– గత ఏడాది అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను, అదే విధంగా నవంబర్ 28 నుండి డిసెంబర్ 06 వరకు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. లక్షలాది మంది సామాన్య భక్తులు బ్రహ్మోత్సవాల్లో సంతృప్తికరంగా స్వామివారి వాహనసేవల దర్శనం చేసుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నాణ్యమైన అన్నప్రసాదం, లడ్డూప్రసాదాలు, వసతి అందించడం జరిగింది.
రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు :
– ఫిబ్రవరి 4న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
– అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో రథసప్తమి వైభవంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం.
జనవరి 13వ తేదీ నుండి కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం
– హిందు ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్ వద్ద ఈ నెల 13 నుండి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశాం.
– శ్రీవారి నమూనా ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
– ప్రయాగ రాజ్‌లో జనవరి 18న శ్రీవారి కల్యాణం నిర్వహించాం. ఈరోజు మరియు ఫిబ్రవరి 3, 12 తేదీలలో కూడా శ్రీవారి కల్యాణాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహిస్తున్నాం.
తిరుమల అభివృద్ధికి విజన్ – 2047
– తిరుమలకు విజన్ – 2047 తయారు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అధికారులకు పలు సూచనలు చేశారు.
– వారి సూచనల మేరకు అలిపిరి బేస్ క్యాంప్, బహుళస్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్డుల నిర్మాణం, సబ్ వే ల నిర్మాణం, రామ్ భగీచ, బాలాజీ బస్టాండ్, పాత సత్రాలను పునర్నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, అవసరమైన పార్కింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.
– టిటిడి ఆధ్వర్యంలో ఉన్న ఆలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం.
శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెంపు
– తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడిసరుకులు, నెయ్యి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాం.
– శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాలలో వినియోగించే నెయ్యి నాణ్యతను పూర్తి స్థాయిలో గుర్తించేలా అత్యాధునిక పరికరాలతో ల్యాబ్‌ను త్వరలో ప్రారంభిస్తున్నాం. ఇందుకోసం రూ.70 లక్షల విలువైన రెండు యంత్రాలను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు విరాళంగా అందించింది.
టీటీడీ ఐటి వ్యవస్థను మరింత బలోపేతం
– టీటీడీ ఐటి వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనము, వసతి తదితర సేవల బుకింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాం.
టీటీడీ ఆసుపత్రులు :
– శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో గత 40 నెలల వ్యవధిలో 3,500 గుండె ఆపరేషన్లు, 17 గుండె మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించాం.
– అదేవిధంగా స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలతో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాం.
స్థానికులకు శ్రీవారి దర్శనం :
– గత ఏడాది డిసెంబరు 3వ తేదీ నుండి తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం.
మరింత ప్రణాళిక బద్ధంగా శ్రీవారి సేవ :
– ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవలో పలు మార్పులు చేపట్టాం.
– తద్వారా భక్తులకు నిరంతరం మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నాం.
హిందూ ధర్మ ప్రచారం:
– సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో భాగంగా హిందూ ధార్మిక ప్రాజెక్టులను కొన్ని దశాబ్దాల క్రితమే టీటీడీ ఏర్పాటు చేసింది.
– హిందూ ధర్మ ప్రచారపరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ మరియు నాళాయిర దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవం ప్రాజెక్టు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థలతో హిందూ ధర్మప్రచారాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ :
– అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని వైభవాన్ని, లోకకల్యాణం కోసం టిటిడి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీ వేంకటేశ్వర భక్తిఛానల్ ద్వారా అందిస్తున్నాం.
ఉద్యోగులకు సంబంధించి :
– టీటీడీ ఉద్యోగుల న్యాయమైన కోరికలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.
– బ్రహ్మోత్సవాలలో విశేష సేవలు అందించిన రెగ్యులర్ ఉద్యోగులకు రూ.15,400/-, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535/- బ్రహ్మోత్సవ బహుమానం అందించడం జరిగింది.
– శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సేవలో ఉద్యోగులు పునరంకితం కావాలని ఈ సందర్భంగా మరోసారి కోరుతున్నాను. అదేవిధంగా రిపబ్లిక్ డే సందర్భంగా చక్కటి పరేడ్ ఏర్పాటు చేసిన భద్రతా విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.