
కన్యాపూజ గురించి తెలుసుకున్నాం కదా.. నవరాత్రులు ముగిసే లోపు ఎప్పుడైనా ఈ పూజ చేయవచ్చని తెలుసుకున్నాం కదా. ఈ పూజలో భాగంగా ముందుగా 2 నుంచి పదేళ్ల బాలికను బాల త్రిపురసుందరీ దేవిగా భావించి పూజకు ఆహ్వానించిన మీదట.. ఆ బాలికకే పూజ చేయాలి. ఇక దీని ఫలితం ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా. ఆసక్తికరంగా ఈ పూజలో బాలిక వయసును బట్టి పేరు, ప్రత్యేక ఫలితం ఉంటుందని దేవీ భాగవతం చెబుతోంది.
2 సంవత్సరాల వయసున్న బాలికను కుమారి అని అంటారు. బాలికను పూజిస్తే దారిద్య్ర సమస్యలు దూరమై ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.
మూడేళ్ల వయసున్న బాలికను త్రిమూర్తి అని అంటారు. ఈ బాలికను పూజిస్తే ఇంట్లో ధన, ధాన్యాలు పెరిగి, కుటుంబ వృద్ధి జరుగుతుంది. నాలుగేళ్ల వయసున్న బాలికను కల్యాణి అని అంటారు. ఈ బాలికను పూజిస్తే విద్యలో వృద్ధి ఉంటుంది. ఐదేళ్ల వయసున్న బాలికను రోహిణి అంటారు. ఈ బాలికను పూజిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యైనా పోతుందట. ఆరేళ్ల బాలికను కాళిక అని.. ఈ పూజ వలన శత్రు బాధలన్నీ తొలగిపోతాయని చెబుతారు. ఏడేళ్ల బాలికను చండిక అని.. ఈ పూజ వలన రాజవైభోగం, సమాజంలో గౌరవం లభిస్తాయట. ఎనిదేళ్ల బాలికను శాంభవి అని ఈ పూజ వలన పదోన్నతి, రాజకీయాల్లో మంచి పేరు వస్తుందట. తొమ్మిదేళ్ల వయసున్న బాలికను దుర్గ అని.. ఈ పూజ వలన కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. పదేళ్ల వయసున్న బాలికను సుభద్ర అని.. ఈ పూజ వలన మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయట.
