మ‌హిళ‌ల భాగ‌స్వామ్యంతో స‌మాజంలో సంప‌దను సృష్టించ‌వ‌చ్చు: టీటీడీ

మ‌హిళ‌ల భాగ‌స్వామ్యంతో స‌మాజంలో సంప‌దను సృష్టించ‌వ‌చ్చ‌ని, జ్ఞాన సంప‌ద‌కు మించిన సంప‌ద లేద‌ని టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి హెచ్ వెంక‌య్య చౌద‌రి పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో శుక్ర‌వారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అద‌న‌పు ఈవో మాట్లాడుతూ, భార‌తీయ నాగ‌రిక‌త మొద‌లైన‌ప్ప‌టి నుండి మ‌హిళ‌ల‌కే పెద్ద‌పీట వేశార‌ని, సృష్టికి మూలం స్త్రీ అని, కుటుంబాన్ని ముందుండి న‌డ‌ప‌గ‌ల శ‌క్తి మాతృమూర్తి సొంత‌మని పేర్కొన్నారు. భారతీయ సమాజం మొదట్లో మాతృస్వామిక వ్యవస్థగా ఉండేదని, క్రమంగా పితృస్వామిక వ్యవస్థగా మారిందని చెప్పారు. వర్తమాన సమాజంలో మహిళలు ఆయా రంగాల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు. పురుషాధిక్య సమాజంలో ఉన్న మహిళలు జ్ఞానానికి మరింత పదును పెట్టాలని, జ్ఞానం మనిషిని తారాస్థాయికి తీసుకెళుతుందని, ఇందుకోసం పాఠ్యపుస్తకాలతో పాటు ప్రపంచ జ్ఞానాన్ని అందించే ఇతర పుస్తకాలను అధ్యయనం చేయాలన్నారు.

విద్య‌తోనే మ‌హిళా సాధికార‌త సాధ్య‌మ‌న్నారు. టీటీడీ ఉద్యోగినులు తమ ఇంటిని చక్కబెట్టుకున్న విధంగానే, సంస్థ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయడానికి కృషి చేయాలని కోరారు. మహిళలు ఉన్నత హోదాలలో వుంటే అవినీతిని కట్టడి చేయవచ్చని తెలిపారు. టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి రంగ‌శ్రీ మాట్లాడుతూ, సనాతన ధర్మంలో మహిళకు పూజనీయమైన స్థానం ఉందని, స్త్రీని దేవ‌త‌గా పూజించ‌డం ఇక్క‌డ మాత్ర‌మే ఉంద‌న్నారు. మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. మహిళలు జ్ఞానాన్ని అలవరచుకుని స్త్రీ పురుష సమానత్వాన్ని చాటాలన్నారు. సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించగలరన్నారు. టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి జాన‌కీ దేవి మాట్లాడుతూ, మహిళలు రాజ్యపాలనతో పాటు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారని తెలియజేశారు. పురుషులు బుద్ధితో ఆలోచిస్తే, మహిళలు హృదయంతో ఆలోచించి పాలన సాగిస్తారని చెప్పారు. మహిళ విజయం వెనుక కుటుంబం ప్రోత్సాహం తప్పక ఉంటుందన్నారు. అంతరిక్ష యానం నుంచి యుద్ధరంగం వరకు అన్నింటా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని మాట్లాడారు.

Share this post with your friends