
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్ట్ 8న వరలక్ష్మీ వ్రతం జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు స్కంద, భవిష్యోత్తర పురాణాల ద్వారా తెలుస్తుంది. కావున సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. శ్రవణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందని అర్చకులు తెలిపారు.
8న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పరిసర రహదారులు, సమీప ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్, సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తుల కోసం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వరలక్ష్మీ వ్రతం నిర్వహించే ఆస్థాన మండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ఆలయ పరిసరాలలో పెండాల్స్, సూచిక బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన మేరకు ముందుగానే శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులను సమకూర్చుకూర్చుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.
