భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంత ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణం.. ఆపై శ్రీరామ పట్టాభిషేకం వంటివి కన్నుల పండువగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 9 వ తేదీ నుంచి వసంత ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు భద్రాద్రిలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకూ కొనసాగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈ రోజు చతిస్తానర్చన, ఊంజల్ సేవ, సింహవాహన సేవలను స్వామివారికి నిర్వహించనున్నారు.
ఇక ఈ నెల 22న అంటే రేపు స్వామివారికి వసంతోత్సవం, హవనం, గజ వాహన సేవ నిర్వహించనున్నారు. 23న చక్రతీర్థం, పూర్ణాహుతి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సారి అంటే క్రోథి నామ సంవత్సరంలో భద్రాద్రి రామయ్య ఆదాయం పెరగనుందని.. వ్యయం తగ్గనుందని ఇప్పటికే జ్యోతిష్య పండితులు వెల్లడించారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ విషయాలను వివరించారు. స్వామివారి కల్యాణంతో పాటు పట్టాభిషేకం తదితర కార్యక్రమాలన్నీ అత్యంత వైభవంగానూ ప్రశాంతంగానూ జరిగాయి.