
తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయంతో పాటు మాడ వీధులను అందంగా అలంకరించారు. ఇక నిన్న అయితే డ్రైఫ్రూట్లు, రోజామాలల అలంకారంతో స్నపనతిరుమంజనం శోభాయమానంగా నిర్వహించారు. ఇక తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు శనివారం తిరుమలకు చేరాయి. ఈ గొడుగులను ధర్మార్థ సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్. గోపాల్ జీ టిటిడి చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ లకు అందజేశారు. వరుసగా 21వ సారి శ్రీవారికి గొడుగులను సమర్పిస్తున్నారు.
శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి మాలలు శనివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల శ్రీ పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అనంతరం ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.
రెండు కుటుంబాల వారీగా ఆండాళ్ మరియు శిఖామణి మాలలు :
ఆండాళ్ మాల – మాల అని కూడా పిలువబడే రెండు శిఖామణి దండలు పెద్ద బుట్టలలో ఉంచి, తిరుపతికి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సమర్పిస్తున్నారు.
భూదేవి అవతారం గోదాదేవి
శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.
